పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27


భారతప్రభుత్వముతో శాంతియుత సంబంధము కలిగియున్న రాజ్యము యొక్క రాజ్యక్షేత్రములను కొల్లగొట్టుట.

126. భారత ప్రభుత్వముతో మైత్రీబంధము లేదా శాంతియుత సంబంధము కలిగియున్న ఏదేని రాజ్యము యొక్క రాజ్య క్షేత్రములను కొల్లగొట్టు లేక కొల్ల కొట్టుటకు సన్నాహములు చేయు వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకును, అట్లు కొల్ల గొట్టుటలో ఉపయోగింపబడిన లేక ఉపయోగించుటకు ఉద్దేశింపబడిన లేక అట్టి కొల్లగొట్టుటద్వారా ఆర్జింప బడిన ఏదేని ఆస్తి యొక్క సమపహరణమునకు కూడ పాత్రులగుదురు.

125వ మరియు 126వ పరిచ్ఛేదములలో పేర్కొన బడిన యుద్ధము లేక కొల్లగొట్టుటద్వారా పొందిన ఆస్తిని పుచ్చుకొనుట.

127. 125వ మరియు 126వ పరిచ్ఛేదములలో పేర్కొనిన అపరాధములలో దేనినైనను చేయుటలో తీసికొనబడినట్టి ఆస్తి అని ఎరిగి యుండియు, ఆ ఆస్తి ని పుచ్చుకొను వారెవరైనను, ఏడు సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకును, అట్లు పుచ్చుకొనిన ఆస్తి యొక్క సమపహరణమునకును కూడ పాత్రులగుదురు.

స్వచ్ఛందముగా పబ్లికుసేవకుడు రాజ్య ఖైదీని లేక యుద్ధఖైదీనితప్పించు కొని పోనిచ్చుట.

128. పబ్లికు సేవకుడై యుండి ఎనలేని రాజ్య ఖైదీగాని యుద్ధఖైదీగాని తన అభిరక్షలో ఉండగా, అట్టి ఖైదీని పరిశోధించి ఉంచిన ఏదేని స్థలము నుండి స్వచ్ఛందముగ అట్టి ఖైదీని తప్పించుకొని పోనిచ్చు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో గాని పది సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

పబ్లికుసేవకుడు నిర్లక్ష్యముతో అట్టి ఖైదీని తప్పించుకొని పొనిచ్చుట.

129. పబ్లికు సేవకుడై యుండి ఎవరేని రాజ్య ఖైదీగాని యుద్ధ ఖైదీగాని తన అభిరక్షలో ఉండగా అట్టి ఖైదీని పరిశోధించి ఉంచిన ఏవేని స్థలము నుండి నిర్లక్ష్యముతో అట్టి ఖైదీని తప్పించుకొని పోనిచ్చు వారెవరై నను మూడు సంవత్సరముల దాకా ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు, జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

అట్టి ఖైదీ తప్పించుకొని పోవుటకు తోడ్పడుట, అతనిని తప్పించుట, లేక అతనికి ఆశ్రయమిచ్చుట.

130. రాజ్య ఖైదీ ఎవరైనను లేక యుద్ధ ఖైదీ ఎవరైనను శాసన సమ్మత అభిరక్ష నుండి తప్పించుకొని పోవుటలో ఎరిగియే అతనికి తోడ్పడు లేక సహాయపడు వారెవరైనను, అట్టి ఏ ఖైదీనైనను తప్పించు లేక తప్పించుటకు ప్రయత్నించు వారెవరైనను, శాసన సమ్మత అభిరక్ష నుండి తప్పించుకు పోయిన అట్టి ఖైదీకి ఎవరికైనను ఆశ్రయమిచ్చు లేక ఆతనిని దాచి పెట్టు వారెవరైనను, అట్టి ఖైదీని తిరిగి పట్టు కొనుటను ప్రతిఘటించు లేక ప్రతిఘటించుటకు ప్రయత్నించు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని శిక్షింపబడుదురు మరియు జూర్మానాకు కూడ పాత్రులగుదురు,

విశదీకరణము : భారతదేశములో నిశ్చిత హద్దులలో పెరోల్ పై యధేచ్ఛగా ఉండుటకు అనుజ్జ ఈయబడినట్టి రాజ్య ఖైదీ లేక యుద్ధ ఖైదీ, ఏ హద్దులలో యధేచ్ఛగా ఉండుటకు అతడు అనుమతింపబడెనో ఆ హద్దులను దాటిపోయినచో, అతడు శాసనసమ్మత అభిరక్ష నుండి తప్పించుకొని పోయినట్లు చెప్పబడును.

అధ్యాయము-7

సైన్యమునకు, నౌకాబలమునకు, వైమానిక బలమునకు సంబంధించిన

అపరాధములను గురించి.

తిరుగుబాటుకు దుష్ప్రేరణ చేయుట లేక 'సైనికునిగాని,నావికునిగాని, వైమానికునిగాని, కర్తవ్య విముఖుని చేయటకు ప్రయత్నించుట.

131. భారత ప్రభుత్వ సైన్యములోని, నౌకాజలము, లేక వైమానిక బలములోని, ఎవరేని అధికారిని, సైనికుని, నావికుని లేక వైమానికుని తిరుగుబాటు చేయుటకు దుష్ప్రేరణ చేయు, లేక అట్టి ఎవరేని అధికారినిగాని, సైనికుని గాని, నావికునిగాని, వైమానికునిగాని అతని రాజ్య నిష్ట నుండియైనను కర్తవ్యమునుండి యైనను విముఖుని చేయు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో గాని పది సంవత్సరముల దాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు, మరియు జుర్మావాకు కూడ పాత్రులగుదురు,

1950 లోని 46వ చట్టము1934లోని 34వ చట్టము 1950 లోని 45వ చట్టము.


విశదీకరణము : ఈ పరిచ్ఛేదములో “అధికారి", "సైనికుడు”, “నావికుడు", మరియు "వైమానికుడు” అను పదముల పరిధియందు, సందర్భానుసారముగ ఆర్మీ చట్టమునకు, సేనా చట్టము 1950 నకు, నేవల్ డిసిప్లిన్ చట్టమునకు, ఇండియన్ నేవీ (డిసిప్లిన్') చట్టము 1934, నకు, ఎయిర్ ఫోర్స్. చట్టమునకు, లేక వైమానిక జల చట్టము, 1950 నకు, లోబడియున్న ఏ వ్యక్తియైనను చేరియుండును,