పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23


దుష్ప్రేరకుని సమక్షములో అపరాధము చేయబడినపుడు.

114. ఎవరేని వ్యక్తిని అతని దుష్ప్రేరణ వలన శిక్షా పాత్రునిగా చేయునట్టి కార్యము లేక అపరాధము చేయబడినపుడు అతడు హాజరులో లేనిచో దుష్ప్రేరకుడుగా శిక్షా పాత్రుడగు ఏ సందర్భములోనైనను అతడు హాజరులో ఉన్నచో అట్టి కార్యమును లేక అపరాధమును అతడు చేసినట్లుగా భావించవలెను.

మరణదండనతో లేక యావజ్జీవ కారావాసముతో శిక్షింపదగు అపరాధమునకు దుష్ప్రేరణ- ఆపరాధముచేయబడనిచో.

115. మరణ దండనతో లేక యావజ్జీవ కారావాసముతో శిక్షింపదగు అపరాధమును చేయుటకు దుష్ప్రేరణ చేయు వారెవరైనను, దుష్ప్రేరణ పరిణామముగా ఆ అపరాధము చేయబడనప్పుడు అట్టి దుష్ప్రేరణను శిక్షించుటకు అభివ్యక్త నిబంధన ఏదియు ఈ స్మృతిలో లేనిచో ఏడు సంవత్సరముల దాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపుకారావాసముతో శిక్షింపబడుదురు. మరియు జూర్మానాకు కూడా పాత్రులగుదురు.

తత్ పరిణామముగా కీడు కలిగించు కార్యము చేయబడినచో.

మరియు దుష్ప్రేరణ పరిణామముగా దుష్ప్రేరకుడు బాధ్యతకు లోనగునట్టిదియు ఎవరేని వ్యక్తి కి ఘాత కలిగించి నట్టిదియు అగు కార్యము చేయబడినచో దుష్ప్రేరకుడు పదునాలుగు సంవత్సరముల దాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసమునకు పాత్రుడగును మరియు జుర్మానాకు కూడా పాత్రుడగును.

ఉదాహరణము

'జడ్' ను హత్య చేయుమని 'బీ' ని 'ఏ' పురికొల్పును. ఆ అపరాధము చేయబడలేదు. 'బి' 'జడ్'ను హత్య చేసియుండినచో అతడు మరణ దండనకు లేక యావజ్జీవ కారావాస శిక్షకు లోనై యుండెడివాడు. కావున 'ఏ' ఏడు సంవత్సరములదాకా ఉండగల కాలావధికి కారావాసమునకును, జుర్మానాకును పాత్రుడగును, మరియు ఆ దుష్ప్రేరణ పరిణామముగా 'జడ్'కు ఏదేని ఘాత కలిగినచో అతడు పదునాలుగు సంవత్సరముల దాకా ఉండగల కాలావధికి కారావాసమునకును, జుర్మానాకును పాత్రుడగును.

కారావాసముతో శిక్షింపదగు ఆపరాధమునకు దుష్ప్రేరణ- ఆపరాధముచేయబడనిచో.

116. కారావాసముతో శిక్షింపదగు అపరాధమునకు దుష్ప్రేరణ చేయువారెవరైనను, దుష్ప్రేరణ పరిణామముగా ఆ అపరాధము చేయబడనిచో, అట్టి దుష్ప్రేరణను శిక్షించుటకు అభివ్యక్త నిబంధన ఏదియు ఈ స్మృతిలో లేనిచో ఆ అపరాధమునకు నిబంధనానుసారము గల దీర్ఘ తను కారావాస కాలావధిలో నాలుగవ భాగము వరకు ఉండగల కాలావధికి ఏ రకపు కారావాసముతో గాని, ఆ ఆపరాధమునకు నిబంధనానుసారముగల జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

దుష్ప్రేరకుడు, లేక దుష్ప్రేరిత వ్యక్తి అపరాధనివారణ తన కర్తవ్యమై యున్నట్టి పబ్లికు సేవకుడుగా ఉన్నచో.

మరియు దుష్ప్రేరకుడు లేక దుష్ప్రేరిత వ్యక్తి అట్టి అపరాధము జరుగకుండ నివారించుట తన కర్తవ్యమై యున్నట్టి ఒక పబ్లికు సేవకుడుగా ఉన్నచో, దుష్ప్రేరకుడు ఆ అపరాధమునకు నిబంధనానుసారముగల దీర్ఘ తమ కాలావధిలో సగ భాగము వరకు ఉండగల కాలావధికి ఆ అపరాధమునకు నిబంధనానుసారము గల ఏ రకపు కారావాసముతో గాని, ఆ అపరాధమునకు నిబంధనానుసారముగల జూర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

ఉదాహరణములు

(ఏ) 'బీ' అను పబ్లికు సేవకుడు తన అధికారకృత్యము లను నిర్వహించుటలో 'ఏ'కు అనుకూలముగా వర్తించుటకు పారితోషికముగా 'బీ' కి 'ఏ' లంచము ఈయజూపును. 'బీ' ఆ లంచమును స్వీకరింప నిరాకరించును, 'ఏ' ఈ పరిచ్ఛేదము క్రింద శిక్షింపదగియుండును,

(బీ) తప్పుడు సాక్ష్యము నిచ్చుటకు 'బీ' ని 'ఏ' అను నతడు పురికొల్పును. ఇచట 'బీ' తప్పుడు సాక్ష్యమును ఈయకున్నను 'ఏ' ఈ పరిచ్చేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడై ఆ ప్రకారమే శిక్షింపదగి యుండును.

(సీ) దోపిడీని నివారించుట తన కర్తవ్యమైనట్టి 'ఏ' అను పోలీసు అధికారి దోపిడీ చేయుటకు దుష్ప్రేరణ చేయును. ఇచట దోపిడి చేయబడనప్పటికినీ 'ఏ' ఆ అపరాధమునకు నిబంధనానుసారముగల దీర్ఘ తమ కారావాస కాలావధిలో సగ భాగమునకును, జుర్మానాకును పాత్రుడగును.

(డీ) దోపిడీని నివారించుట తన కర్తవ్యమై నట్టి 'ఏ' అను పోలీసు అధికారిని దోపిడి చేయుమని 'బీ' దుష్ప్రేరణ చేయును. ఇచట దోపిడీ చేయబడనప్పటికినీ 'బీ' ఆ అపరాధమునకు నిబంధనానుసారముగల దీర్ఘ తను కారావాస కాలావధిలో సగ భాగమునకును, జుర్మానాకును పాత్రుడగును.

ఆపరాధము చేయుటకు జనసామాన్యమునుగాని పదుగురికంటె ఎక్కువ మంది వ్యక్తులనుగాని దుష్ప్రేరణ చేయుట.

117. జన సామాన్యమునైనను, పదుగురికి మించిన ఎంతమందినైనను, ఏదేని వర్గమునై నను ఒక అపరాధము చేయుటకు దుష్ప్రేరణ చేయువారెవరైనను, మూడు సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.