పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22


ఒక కార్యము దుష్ప్రేరితమై దానికి భిన్నమైన కార్యము చేయబడినపుడు దుష్ప్రేరకుని బాధ్యత.వినాయింపు.

111. ఒక కార్యము దుష్ప్రేరితమై దానికి భిన్నమైన కార్యము చేయబడినపుడు ఆ చేయబడిన కార్యమునే తాను దుష్ప్రేరణ చేసియుండిన ఎట్లో అదేరీతిగను, అదే మేరకును, చేయబడిన ఆ కార్యమునకు దుష్ప్రేరకుడు బాధ్యుడగును;

అయితే, చేయబడిన కార్యము బహుశః ఆ దుష్ప్రేరణ పరిణామమై యుండి దుష్ప్రేరణ అగునట్టి పురికొల్పుట వలన ప్రోద్బలముతోగాని, అట్టి తోడ్పాటుతోగాని, అట్టి కుట్ర ననుసరించి గాని చేయబడి యుండవలెను.

ఉదాహరణములు

(ఏ) 'జడ్' యొక్క ఆహారములో విషము పెట్టుటకు 'ఏ' అనునతడు ఒక బిడ్డను పురికొల్పి, అందుకొరకై అతనికి విషమును అందజేయును. ఆ పురికొల్పుట పరిణామముగా ఆ బిడ్డ పొరపాటున ఆ విషమును, 'జడ్' యొక్క ఆహారము ప్రక్కన ఉన్నట్టి 'వై' యొక్క ఆహారములో పెట్టును. ఇచట 'ఏ' పురికొల్పుటవలన ప్రోద్బలమునకు ఆ బిడ్డ లోనై వ్యవహరించుచుండి చేసిన కార్యము ఆ పరిస్థితులలో బహుశః ఆ దుష్ప్రేరణవలన కలుగగల పరిణామమై యుండుచో ఆ బిడ్డను 'వై' యొక్క ఆహారములో ఆ విషమును పెట్టుటకు పురికొల్పిన ఎట్లో ఆ రీతిగను, ఆ మేరకును 'ఏ' బాధ్యుడగును.

బి) 'జడ్' యొక్క ఇంటిని తగులబెట్బటకు 'బి' ని 'ఏ' అనునతడు వురికొల్పును. 'బీ' ఆ ఇంటికి నిప్పంటించి అదే సమయమున అచటి ఆస్తిని దొంగిలించును. ఆ దొంగతనము ఇంటిని తగులబెట్టుటవలన బహుశ: కలిగెడు పరిణామము గాక వేరే కార్యమైనందున 'ఏ' ఇంటిని తగులబెట్టుటకు దుష్ప్రేరణ చేసినవాడైనను, దొంగతనమునకు దుష్ప్రేరణ చేసినవాడు కాడు.

(సీ) ఒక నివాస గృహమును అర్థరాత్రి వేళ దోపిడీ చేయు నిమిత్తము 'బి' ని, 'సీ' ని 'ఏ' అనునతడు పురికొల్పి, అందు నిమిత్తమై వారికి ఆయుధములు సమకూర్చును. 'బి' యు 'సీ' యు ఆ గృహములో జొరబడి అందు నివసించువారిలో ఒకరైన 'జడ్' చే ప్రతిఘటింపబడిన వారై 'జడ్'ను హత్య చేయుదురు. ఇచట ఆ హత్య బహుశ: దుష్ప్రేరణ వలని పరిణామమై యున్నచో 'ఏ' హత్యను గూర్చిన నిబంధనానుసారముగల శిక్షకు పాత్రుడగును.

దుష్ప్రేరకుడు దుష్ప్రేరిత కార్యమునకుమ చేయబడిన కార్యమునకును సంకలిత శిక్షకు ఎప్పుడు పాత్రుడగును.

112. దుష్ప్రేరిత కార్యమునకు అదనముగా పై కడపటి పరిచ్ఛేదము క్రింద దుష్ప్రేరకుడు శిక్షాపాత్రుడగునట్టి కార్యము చేయబడి అది ఒక విభిన్న అపరాధమైనచో, దుష్ప్రేరకుడు ఆ అపరాధములలో ప్రతియొక్క దానికి శిక్షాపాత్రుడగును.

ఉదాహరణము

ఒక పబ్లికు సేవకుడు చేసిన జప్తును బల ప్రయోగము ద్వారా ప్రతిఘటించుటకు 'బీ' ని 'ఏ' పురికొల్పును. తత్ పరిణామముగా 'బీ' ఆ జప్తును ప్రతిఘటించి అట్లు ప్రతి ఘటించుటలో జప్తును అమలుపరచుచున్న అధికారికి దారుణమైన ఘాతను స్వచ్ఛందముగా కలిగించును. 'బీ' జప్తును ప్రతిఘటించు అపరాధమును, దారుణమైన ఘాతను స్వచ్చందముగా కలిగించు అపరాధమును, రెండింటిని చేసినందున 'బీ' ఆ రెండు అపరాధములకు శిక్షా పాత్రుడగును. మరియు జప్తును ప్రతిఘటించుటలో 'బీ' దారుణమైన ఘాతను స్వచ్చందముగా కలిగించుట సంభవమని 'ఏ' ఎరిగియున్నఎడల ఆ అపరాధములో ప్రతియొకదానికి 'ఏ' కూడ శిక్షా పాత్రుడగును.

దుష్ప్రేరకుడు ఉద్దేశించిన దానికి భిన్నమగు పరిణామము దుష్ప్రేరిత కార్యమువలన కలిగినచో ఆ పరిణామమునకు దుష్ప్రేరకుని బాధ్యత.

113. ఒక ప్రత్యేకమైన పరిణామమును కలిగించు ఉద్దేశముతో దుష్ప్రేరకునిచే ఒక కార్యము దుష్ప్రేరణ చేయబడి, దుష్ప్రేరకునికి అతని దుష్ప్రేరణ వలన బాధ్యత గలుగు నట్టి ఒక కార్యము, దుఁష్ప్రేరకుడు ఉద్దేశించిన దానికి భిన్నమగు పరిణామమును కలిగించినపుడు ఆ పరిణామమును కలిగించు ఉద్దేశముతో ఆ కార్యమును దుష్ప్రేరకుడు దుష్ప్రేరణ చేసి యుండిన ఎట్లో ఆ రీతిగనే మరియు ఆ మేరకు ఆ పరిణామము విషయమున దుష్ప్రేరకుడు బాధ్యుడగును. అయితే దుష్ప్రేరిత కార్యము వలన అట్టి పరిణామము కలుగుట సంభవమని అతడు ఎరిగి యుండ వలెను.

ఉదాహరణము

'జడ్' కు దారుణమైన ఘాతను కలిగించుటకు 'బీ' ని 'ఏ' పురికొల్పును. ఆ పురికొల్పుట పరిణామముగా 'జడ్'కు దారుణమైన ఘాతను 'బీ' కలిగించును. తత్ పరిణామముగా 'జడ్' మరణించును. అచట దుష్ప్రేరణ చేయబడిన దారుణమైన ఘాత వలన మరణము కలుగుట సంభవమని 'ఏ' ఎరిగియుండినచో, హత్యను గూర్చిన నిబంధనాను సారముగల శిక్షకు 'ఏ' పాత్రుడగును.