పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21


చేయును, 'బీ' తన అపరాధ విషయమున హత్యకు ఏ శిక్ష గలదో ఆ శిక్షకు పాత్రుడగును, మరియు, 'ఏ' ఆ అపరాధము చేయుమని 'బీ'ని పురికొల్పినందున 'ఏ' కూడ అదే శిక్షకు పాత్రుడగును.

విశదీకరణము 5:—కుట్రద్వారా దుష్ప్రేరణాపరాధము చేయుటకు, దుష్ప్రేరితాపరాధము చేయు వ్యక్తితో దుష్ప్రేరకుడు కలిసి ఆ ఆపరాధమును జరుపు యోచన చేయుట అవసరము కాదు; ఏ కుట్ర ననుసరించి ఆ అపరాధము చేయబడినదో ఆ కుట్రలో ఆతడు పాల్గొనిన చాలును.

ఉదాహరణము

'జడ్' కు విషప్రయోగము చేయుటకై 'బీ' తో కలిసి 'ఏ' ఒక పథకమును యోచించును. విషమును 'ఏ' ఈయవలెనని ఒప్పందమైనది. ఆటుపై 'ఏ' యొక్క పేరును తెలుపకుండ అన్యవ్యక్తి ఎవరో విషమును ఇచ్చునని తెలుపుచు, 'బీ' ఆ పథకమును 'సీ'కి విశదీకరించును. 'సీ' విషమును సేకరించుటకు ఒప్పుకొని తనకు విశదీక రింపబడిన రీతిగా వాడబడుటకై విషమును సేకరించి 'బి'కి అందజేయును. ఆ విషమును 'ఏ' ఇచ్చును. తత్ పరిణామముగా 'జడ్' మరణించును. ఇచట 'ఏ' తో కలిసి 'సీ' కుట్ర చేయకున్నను ఏ కుట్రననుసరించి 'జడ్' హత్య చేయబడినాడో ఆ కుట్రయందు 'సీ' పాల్గొనినాడు. అందువలన 'సీ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడై హత్యకు ఏ శిక్ష గలదో ఆ శిక్షకు పాత్రుడగును.

భారత దేశము వెలుపల చేయబడు అపరాధములకు భారత దేశములో దుష్ప్రేరణ.

108-ఏ. భారతదేశములో చేయబడియుండినచో అపరాధమగునట్టి ఏదేని కార్యము భారత దేశమునకు వెలుపలను, ఆవలను చేయబడుటకు భారత దేశములో ఆ కార్యమును దుష్ప్రేరణ చేయు వ్యక్తి ఈ స్మృతి భావములో అపరాధ దుష్పరణ చేసినవాడగును.

ఉదాహరణము

గోవాలో హత్య చేయుటకు గోవాలో ఉన్న 'బీ' అను ఒక విదేశీయుని భారత దేశమందున్న 'ఏ' పురికొల్పును, 'ఏ' హత్యాదుష్ప్రేరణ చేసినవాడగును.

దుష్ప్రేరణ పరిణామముగా దుష్ప్రేరిత కార్యము చేయబడి ఆ దుష్ప్రేరణ శిక్షకై అభివ్యక్త నిబంధన యేదియు లేనప్పుడు శిక్ష

109. ఏదేవి, అపరాధమును దుష్ప్రేరణ చేయునతడెవరైనను, ఆ దుష్ప్రేరిత కార్యము దుష్ప్రేరణ పరిణామముగా చేయబడి, అట్టి దుష్ప్రేరణను శిక్షించుటకై ఈ స్మృతిలో అభివ్యక్త నిబంధన యేదియు లేనిచో, ఆ అపరాధమునకు ఏర్పాటు చేయబడిన శిక్షతో దండింపబడును.

విశదీకరణము :-దు షేరణ అగునట్టి పురికొల్పుట యొక్క పరిణామముగా లేక అట్టి కుట్రనసుపరించి , అభివ్యక్ష లేకి అట్టి తోడ్పాటుతో ఒక కార్యము లేక అపరాధము చేయబడినపుడు, ఆ కార్యము లేక అపరాధము దుష్పేరణ పరిణామముగా చేయబడినట్లు చెప్పబడును.

ఉదాహరణములు

(ఏ) 'బీ' అను పబ్లికు సేవకుడు తన అధికార కృత్యములను నిర్వహించుటలో 'ఏ' కు అనుకూలముగా వర్తించు టకు పారితోషికముగా 'బీ' కి 'ఏ' లంచము ఈయజూపును. 'బీ' ఆ లంచమును స్వీకరించును. 161వ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమునకు 'ఏ' దుష్ప్రేరణ చేసినవాడగును,

(బీ) తప్పుడు సాక్ష్యము నిచ్చుటకు 'బి' ని 'ఏ' పురికొల్పును. ఆ పురికొల్పుట పరిణామముగా 'బి' ఆ అపరాధమును చేయును, 'ఏ' ఆ అపరాధ దుష్ప్రేరణ చేసినవాడై ఏ శిక్షకు 'బి' పాత్రుడగునో ఆ శిక్షకు పాత్రుడగును.

(సీ) 'జడ్' కు విషము నిచ్చుటకు 'ఏ' 'బి' లు కుట్ర పన్నుదురు, ఆ కుట్రననుసరించి 'ఏ' విషమును సేకరించి దానిని 'జడ్' కు ఈయవలసినదిగా 'బి' కి అందజేయును, 'బి' ఆ కుట్ర ననుసరించి ఆవిషమును 'ఏ' లేనపుడు 'జడ్' కు ఇచ్చి తద్వారా 'జడ్' కు మరణము కలిగించును. ఇచట 'బి' హత్య చేసినవాడగును. 'ఏ' కుట్రద్వారా అపరాధమును దుష్ప్రేరణ చేసినవాడై హత్యకు ఏ శిక్ష గలదో ఆ శిక్షకు పాత్రుడగును.

ఒక కార్యమును దుష్ప్రేరకుని ఉద్దేశ్యముకన్న భిన్నమైన ఉద్దేశ్యముతో దుష్ప్రేరిత వ్యక్తి చేసిన యెడల దుష్ప్రేరణకు శిక్ష.

110. ఒక ఆపరాధమును చేయుటకు దుష్ప్రేరణ చేయువారెవరైనను, దుష్ప్రేరిత వ్యక్తి ఆ కార్యమును దుష్ప్రేరకుని ఉద్దేశ్యముకన్న భిన్నమైన ఉద్దేశ్యముతో లేక ఎరుకతో చేసినచో, ఆ కార్యము దుష్ప్రేరకునికి గల ఉద్దేశ్యముతో లేక ఎరుకతోనే చేయబడినచో ఏ అపరాధము చేయబడి యుండెడిదో ఆ అపరాధమునకు నిబంధనానుసారముగల శిక్షతో దండింపబడుదురు. ఇతర శిక్ష తోకాదు.