పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

73


నిర్ణయం మీద స్థిరంగా వుండగలిగితే అట్టి జాబు వ్రాసి. నాకు యివ్వండి ఒక్క విషయం మాత్రం స్పష్టగా చెబుతున్నాను మీ మీద దాడిచేసినవారి మీద కేసు నడపడం యిష్టం లేదని మీరు మీ బుద్ధిపూర్వకంగా వ్రాసి యివ్వాలి అందుకు బాధ్యత మీరే వహించాలి. అప్పుడే నేను మీ జాబును ఉపయోగించగలుగుతాను "

"మీరు యీ విషయం మాట్లాడుటకు పిలిపించారని నేను ఊహించలేదు ఈ విషయమై ఎవ్వరితోను నేను చర్చించలేదు. చర్చించాలనే ఉద్దేశ్యం కూడా నాకు లేదు. నేను శ్రీ లాటిన్‌గారి వెంట బయలు దేరి ఓడదిగి ముందుకు సాగినప్పుడే తెల్లవారు ఎంతటి కష్టం కలిగించినా వారిని తప్పుపట్టను అని మనస్సులో నిర్ణయించుకున్నాను. అందువల్ల నా మీద దాడిచేసినవారి మీద కేసు పెట్టడానికి ఆస్కారమే లేదు. నా మనస్సులో ఒక ధార్మిక ప్రశ్న బయలుదేరింది. మీరు అన్న ప్రకారం నా యీ సంయమంవలన నాజాతితోబాటు నాకుకూడాలాభం కలుగుతుందని భావిస్తున్నాను అందువల్ల బాధ్యతంతా నా నెత్తిన వేసుకొని యిప్పుడే మీరు కోరిన పత్రం వ్రాసి యివ్వదలిచాను" అని చెప్పాను

నేను శ్రీ ఎస్కంబ్‌గారిని ఒక తెల్ల కాగితం అడిగి తీసుకొని, అక్కడే వ్రాసి, వారికి ఆ పత్రం యిచ్చివేశాను


8

భారతీయులు ఏంచేశారు? -3

ఇంగ్లాండులో చేసిన పనులు

గతప్రకరణాల్లో భారతీయులు తమస్థితిగతులయందు మార్పులు తెచ్చుటకు చేసిన ప్రయత్నాలను గురించి, ప్రతిష్ఠను పెంచుకొన్న పద్ధతిని గురించి పాఠకులు తెలుసుకున్నారు. దక్షిణాఫ్రికాలో భారతీయుల సర్వాంగీణ వికాసానికి ఇంగ్లాండు నుంచి లభించ గలిగినంత సాయం పొందడానికి అవిరళకృషి చేశారు. భారతీయులు జరిపిన ప్రయత్నాల్ని గతంలో వివరించాను