పుట:తెలుగు వాక్యం.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుకృతి

83

కర్త్రుద్ధరణ సూత్రపరంగా చెపితే (198) b లో సుబ్బారావును చెప్పింది అనే క్రియకు ముఖ్యకర్మగా భావించాలి. చెప్పు అనే క్రియ విషయార్థక నామాలనే (విషయం, సంగతి, మాట, కథ మొ॥) కర్మపదాలుగా గ్రహిస్తుంది కాని మనుష్య వాచక నామాలను ముఖ్యకర్మలు (direct objects) గా గ్రహించ గలిగినట్టు భాషలో సాక్ష్యం లేదు. అందువలన అనుకృత (పరోక్ష) విధి వాక్యాలను కర్త్రుద్ధరణ సూత్రవిషయాలుగా గ్రహించటం కుదరదు.

3.52 : తగినంత బలం లేకపోయినా ఆలోచించదగిన ఇంకో పరిష్కారమార్గం ఉంది. విధివాక్యాల్లో అని విధిక్రియతో కల్సిపోయి ఏకపదంగా ఏర్పడింది. అంటే పరోక్ష విధిలో అని ని క్రియ నుంచి వేరుచేసి వాక్యాన్ని ప్రయోగించలేం. అందువల్ల పరోక్ష విధిలో క్రియ అని తో కలిసి మనుష్యవాచక శబ్దాన్ని కర్మగా గ్రహించ గలిగిన సకర్మక క్రియగా ఏర్పడిందని చెప్పవచ్చు. ఇది ఒక ఊహ మాత్రమే.

3.53 : విధివాక్యాలు ఆజ్ఞ, అభ్యర్థనాద్యర్థకాలు బోధిస్తై. ఈ వాక్యాల గుప్త నిర్మాణంలో పై అర్థాల్లో ఒక క్రియను ప్రతిపాదించాల్సిన అవసరాన్ని శాస్త్రజ్ఞులు ఇంతకు ముందే గుర్తించారు. ఆ ప్రతిపాదన నిలబడితే విధివాక్యాల కర్తలను అట్లాంటి క్రియకు కర్మగా ప్రతిపాదించవచ్చు. అంటే విధివాక్యాల గుప్తనిర్మాణం (deep structure) లో విధివాక్య, గర్భవాక్యాలను ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఉదాహరణకు (198) వాక్యాలకు ఈ కింది వాక్యాన్ని గుప్త నిర్మాణ సదృశంగా ప్రతిపాదించటానికి వీలుంది.

(199)

సుజాత సుబ్బారావును “నువ్వు మా యింటికిరా” అని కోరింది.
  (అడిగింది, అభ్యర్థించింది, ఆజ్ఞాపించింది.)

ఈ ప్రతిపాదన నిలబడితే 198లో వాక్యాలను కొన్ని లోపకార్యాల ద్వారా సాధించవచ్చు. 198b లో సుబ్బారావు అనే పదరూపాన్ని గుప్త నిర్మాణం నుంచే సాధించే వీలుంది. అయితే ఈ రకమయిన వివరణకైనా పూర్తి వివరాలు పరిశోధిస్తేనే కాని బలంచిక్కదు.

ప్రత్యక్షవిధులను పరోక్షవిధులనుంచి, ప్రత్యక్ష ప్రశ్నలను పరోక్షప్రశ్నల మంచి నిష్పన్నం చెయ్యవచ్చునని ఇటీవల కొందరు శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు.