పుట:తెలుగు వాక్యం.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

తెలుగు వాక్యం

2.72711 : ప్రధాన వాక్యంలో సమాపక క్రియ భౌతిక వ్యాపార బోదకమైనప్పుడు లక్ష్యార్థంలో అటమంతనామానికి కి విభక్తి చేరుతుంది. ఈ అర్థం ప్రధాన, ఉపవాక్యాలు ఏకకర్తృకాలైనప్పుడే వస్తుంది.

(171)

a. మా ఆవిడ పక్కింటామెతో హస్కుకొట్టటానికి వెళ్లింది.
b. సుబ్బారావు డబ్బులడుక్కోవటానికి వచ్చాడు.
C. అతను బతకటానికి చిన్న కొట్టు పెట్టుకున్నాడు.
d. సుజాత మధ్యాహ్నం తినటానికి రొట్టెలు తెచ్చుకుంటుంది.

ఈ పై వాక్యాల్లో కి విభక్తి కి బదులు ఇదే అర్థంలో కోసం అనే శబ్దం ప్రయోగించవచ్చు.

2.72712 : కి విభ క్తి చేరిన అటమంత నామం మనో వ్యాపార బోధక మైన ప్రధాన క్రియకు కారణం అవుతుంది.

(172)

a. నలుగుర్లోకి రావటానికి ఆమె సిగ్గుపడుతుంది.
b. ఇంగ్లీషులో మాట్లాటానికి అతను భయపడతాడు.
c. వానలో బయటికి వెళ్లటానికి సందేహిస్తున్నాను.
d. పరీక్షఫీజు కట్టటానికి తటపటాయిస్తున్నాడు.

ఈ రకమైన ఈ ఆర్థభేదం ఈ కింది వాక్యంలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాన క్రియను భౌతిక వ్యాపారంగానూ, మనోవ్యాపారంగానూ వ్యాఖ్యానించవచ్చు

e. అతను విదేశాలు వెళ్లటానికి కష్టపడుతున్నాడు.

ఈ పై వాక్యంలో కష్టపడు భౌతికవ్యాపార మైనప్పుడు వెళ్ళటానికి అనేది. లక్ష్యమవుతుంది. మనోవ్యాపారమైనప్పుడు (ఉదాహరణకు తనవాళ్లందరినీ - వదిలి వెళ్ళాల్సి వచ్చినందుకు) కారణమవుతుంది.

లక్ష్యార్థంలో ఉపవాక్యంలో వ్యక్తమైన వ్యాపారం కర్తకు ఇచ్ఛాపూర్వకం. కాని మనోవ్యాపార క్రియలు ప్రధాన వాక్యంలో ఉన్నప్పుడు ఉపవాక్యంలో వ్యక్తమైన వ్యాపారం ఇచ్ఛాపూర్వకం కావచ్చు, కాకపోవచ్చు.