పుట:తెలుగు వాక్యం.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

తెలుగు వాక్యం

గుప్తనిర్మాణపుకర్తల్లో ఏకత్వం ఉండాలని బాలవ్యాకర్త ఉద్దేశించినట్టు కనిపిస్తుంది. కాని కొట్టంబడి అనే క్రియకు చైత్రుడు ఆశ్రయం (“కర్తకుచేత వర్ణకంబగు"). మైత్రుడు ఆశ్రయంకాదు. కర్మణిసూత్రంవల్ల ఏర్పడిన కర్త. అంటే వ్యక్త నిర్మాణపు కర్త. క్త్వార్థకాది క్రియలున్న వాక్యాల్లో సమాన కర్తృకాలంటే క్త్వార్థక సూత్రం వర్తించేటప్పుడున్న కర్తలనే అర్థం చెప్పుకోవాలి. గుప్తనిర్మాణంనుంచే క్త్వార్థక క్రియ లేర్పడవచ్చు. కర్మణి సూత్రప్రవర్తన తరవాత (కర్మణిసూత్రం వల్ల గుప్తనిర్మాణంలో కర్తృకర్మలకు వ్యత్యయం ఏర్పడుతుంది ) ఉన్న కర్తలలో సమానతనిబట్టికూడా క్త్వార్థక మేర్పడవచ్చు. దీన్నిబట్టి "సమాన కర్తృక" మనే నియమాన్ని గుప్తవ్యక్త నిర్మాణాల్లో ఏ ఒక్కదానికి ప్రత్యేకంగా నిబంధించకుండా, క్త్వార్థకసూత్రం వర్తించేటప్పుడున్న కర్తలనే అర్థం చెప్పుకోవాలి. ఈ క్రింది వాక్యాలనుబట్టి ఈ నియమ ప్రవర్తనను గుర్తించవచ్చు.

(63)

సుజాత (సుబ్బారావుసు) తిరస్కరించి బాధపడింది.


(64)

సుజాత (సుబ్బారావుచేత) తిరస్కరించబడి బాధపడింది.

పై రెండు వాక్యాల్లో గుప్తనిర్మాణపు కర్తలు వేరనే విషయం స్పష్టమే. (63)లో సుజాత, (64)లో సుబ్బారావు గుప్తనిర్మాణపు (వ్యాపారాశ్రయమైన) కర్తలు. అయినా రెండుచోట్లా క్త్వార్థక క్రియ సాధ్యమయింది.

కర్మణి సూత్రం (64)లో ఉపవాక్యానికి వర్తించింది. ప్రధాన వాక్యంలో సకర్మకక్రియ ఉంటే అక్కడ కూడా వర్తించవచ్చు. రెండు చోట్లా వర్తించిన ఈ క్రింది వాక్యాన్ని గమనించండి.

(65)

సుజాత సుబ్బారావుచేత తిరస్కరించబడి అవమానించ బడింది.

క్త్వార్థక క్రియ, ప్రధానక్రియ సన్నిహితంగా ఉన్నపుడు క్త్వార్థకంలో కర్మణి క్రియారూపాన్ని సూచించే 'పడు' ధాతురూపాన్ని లోపింపజేసినా ప్రధాన క్రియ నుంచి కర్మణి అర్థాన్ని గ్రహిస్తుంది.

(66)

సుజాత సుబ్బారావుచేత తిరస్కరించి అవమానించబడింది.

(65) (66) వాక్యాలు సమానార్థకాలు. రెండిట్లో క్రియలకు గుప్త నిర్మాణ కర్త సుబ్బారావు; కర్మ సుజాత. వాక్యం (66)లో సుబ్బారావుచేత అనే పద బంధాన్ని లోపింపజేస్తే అది భిన్నార్థబంధకం అవుతుంది.