పుట:తెలుగు వాక్యం.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామాన్య వాక్యాలు

19

చాలు అనే క్రియ అన్నంత క్రియకు అనుబంధింపబడి అశక్తతను చూపిస్తుంది. దీనికి వ్యతిరేకంలో మాత్రమే ప్రయోగం ఉంటుంది. చాలు కు అన్నంత రూపంలో అన్ని క్రియావిభక్తులు చేరతై . దీనికి భవిష్యత్తులోనే ప్రయోగం ఉంటుంది.

(39)

స్వార్థపరులైన నాయకులు ప్రజలకు మేలుచేయజాలరు.

చాలు అనే క్రియతో ఈ రకమైన ప్రయోగాలు కావ్యభాషలో ఎక్కువగా ఉన్నై, ఆధునిక బాషలో కొన్ని తెలంగాణా జిల్లాలలో మాత్రమే వినిపిస్తై.

తక్షణ భవితవ్యం : పోవు.

(40)

నేను ఊరికి వెళ్ళబోతున్నాను.

ఈ క్రియ అనుసంధించినపుడు మిగతా క్రియలకు లాగే అన్ని కాలాలలోనూ రూపాలుంటై.

నిషేధార్థం : వద్దు.

(41)

చెప్పుడు మాటలు వినవద్దు.

ఈ రకమైన వాక్యం సాధారణంగా మధ్యమ పురుషకర్తృకంగా ఉంటుంది. తెలంగాణాలో కొందరి వ్యవహారంలో ప్రధమోత్తమ పురుష కర్తృకంగా కూడా ఉండవచ్చు.

1.25 : నిశ్చయార్థక వాక్యాలన్నిటికీ వ్యతిరేక వాక్యాలుంటై. క్రియా సహిత వాక్యాలలో వ్యతిరేక క్రియాప్రయోగం వల్ల వ్యతిరేక వాక్యాలు ఏర్పడతై. ఆ క్రియారూపాలు కాలభేదాల్ని బట్టి వేరువేరుగా ఉంటై. అన్నంత క్రియారూపం మీద లేదు అనే శబ్దాన్ని ప్రయోగిస్తే భూతకాల వ్యతిరేక క్రియలు, ఆటమంత భావార్థక రూపాలమీద లేదు అనే శబ్దాన్ని ప్రయోగిస్తే వర్తమాన వ్యతిరేక క్రియా రూపాలు ఏర్పడతై. ఈ రెండు రూపాల్లోనూ కర్తృబోధను సూచించే క్రియా విభక్తులుండవు. అంటే , అన్ని పురుషలలోనూ ఒకేరూపం నిశ్చలంగా ఉంటుంది. లేదు అనే శబ్దం క్రియాసహిత వాక్యాలతో ఏర్పడ్డ ప్రశ్నలకు వ్యతిరేకంలో ఇచ్చే సమాధానాలన్నింటికి వాక్యాదిని అవ్యయంగా ఉపయోగించవచ్చు,