పుట:తెలుగు వాక్యం.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

తెలుగు వాక్యం

లేదు శబ్దంలో లే ఉండు ధాతువుకు భూతకాల వ్యతిరేకంలో వచ్చే ఆదేశరూపం; దు అమహద్విభక్తి. అయినా ఈ పైన చెప్పిన ప్రయోగాల్లో లేదు అవ్యయంగానే ఉపయుక్త మవుతుంది. వ్యతిరేక భవిష్యత్క్రియ అన్నంత క్రియారూపం మీద క్రియావిభక్తులను చేర్చటంవల్ల ఏర్పడుతుంది.

1.26 : వాక్యంలో క్రియేతర శబ్దాలకు ప్రాధాన్యాన్ని సూచించే కొన్ని పద్ధతులు ఇంతకు ముందే పేర్కొన బడై . ఇంకొక పద్ధతి వాక్యంలో క్రియేతర శబ్దాన్ని ఆఖ్యాత స్థానానికి జరపటం. అప్పుడు అట్లా జరిగిన పదం విధేయ మవుతుంది; మిగతా వాక్యభాగమంతా ఉద్దేశ్యమవుతుంది. ఈ నామ్నీకృత రూపం క్రియాజన్య విశేషణం మీద ది అనే ప్రత్యయం చేర్చటంవల్ల ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను ప్రాధాన్య వివక్షామూలక నామ్నీకరణం అనవచ్చు. అది ఈ క్రింది వాక్యాలలో ఉదాహరించబడుతుంది.

(42)

a. సుబ్బారావు నిన్న పట్నంనుంచి పిల్లిపిల్లను తెచ్చాడు.
b. సుబ్బారావు నిన్న పట్నం నుంచి తెచ్చింది పిల్లిపిల్లను.
c. సుబ్బారావు నిన్న పిల్లిపిల్లను తెచ్చింది పట్నంనుంచి.
d. సుబ్బారావు పట్నంనుంచి పిల్లిపిల్లను తెచ్చింది నిన్న.
e. నిన్న పట్నంనుంచి పిల్లిపిల్లను తెచ్చింది సుబ్బారావు.

పై వాక్యాలలో ప్రధానార్థం ఒకటే అయినా ఆఖ్యాత స్థానానికి జరిగిన పదానికి ఎక్కువ ప్రాధాన్యం వచ్చింది.

ప్రశ్నార్థక శబ్దాలున్న వాక్యాల్లో కూడా ఈ రకమయిన మార్పు జరుగుతుంది. ఆ వాక్యాలలో ప్రశ్నార్థక శబ్దం విధేయమై ఆఖ్యాత స్థానానికి జరిగినప్పుడు అటమంత భావార్థక రూపం కూడా ప్రయోగించవచ్చు.

(43)

a. మీరు ఊరికి ఎప్పుడు వెళ్తారు?
b. మీరు ఊరికి వెళ్ళటం ఎప్పుడు?

భావార్థక రూపంలో కాలబోధ లేదు. సందర్భాన్నిబట్టే కాలాన్ని గ్రహించాల్సి ఉంటుంది.