పుట:తెలుగు వాక్యం.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

తెలుగు వాక్యం

1.20 : క్రియాసహిత వాక్యాలు : క్రియాసహిత సామాన్య వాక్యాలలో క్రియ వాక్యాంతంలో వస్తుంది. క్రియలలో చాలారకాలు విభాగాలు చేయవచ్చు. అందులో ఒక విభాగం సకర్మక అకర్మక క్రియాభేదం. సకర్మక క్రియ కర్మపదాపేక్షికం. అకర్మకక్రియ కర్మపద నిరపేక్షకం. ఉండు, పోపు, వచ్చు వంటి క్రియలు అకర్మకాలు, కొను, తిను, చేయు వంటివి సకర్మకాలు. సకర్మకాలలో కొన్ని ద్వికర్మకాలు. అంటే ఈ క్రియలకు రెండు కర్మపదాలుంటాయి. రెండు కర్మలున్నప్పుడు ఒకదాన్ని ముఖ్యకర్మ అని, రెండవదాన్ని అముఖ్య కర్మ అని అంటారు. ఇవికాక క్రియలను వాటి ఆర్థాలను బట్టి స్థితిబోధకాలని, గతిబోధకాలని, సంఘటన బోధకాలని, వచ్యర్థకాలని చాలా రకాలుగా విభాగాలు చేయవచ్చు. చేయవచ్చునంటే వాక్యనిర్మాణ విధానంలో, ఈ విభాగానికి ప్రమేయముంటుందని అర్థం. తెలుగు క్రియలకు . ఇట్లాంటి విభాగం సుష్ఠుగా జరగలేదు. విశేషమైన పరిశోధన జరిగితేగాని ఇట్లాంటి విభాగం సాధ్యంకాదు, జరిగినంత మటుకు కొంతలో కొంత ఈ రచనలో అక్కడక్కడ ప్రసక్తమవుతుంది.

1.21 : వాక్యంలో ప్రధాన విభాగం నామబంధం, ఆఖ్యాత బంధం. ఆఖ్యాత బంధంకూడా నామబంధమయితే ఇంతకుపూర్వం చర్చించిన క్రియారహిత వాక్యాలు నిష్పన్నమవుతై. ఆఖ్యాతబంధం క్రియాసహితమైతే అకర్మక, సకర్మక భేదం ప్రవర్తిత మవుతుంది. సకర్మక క్రియాబంధంలో ఇంకో నామబంధం ఉండొచ్చు. క్రియాబంధంలో ఉన్న నామబంధం ఆ క్రియకు కర్మ అవుతుంది. క్రియాబంధంలో భాగం కాని నామబంధం కర్తృపద మవుతుంది. దీన్ని బట్టి వాక్యంలో కర్తృ, కర్మ పదాలుగా రాగలిగిన సామర్ధ్యం నామ పదానికున్నట్లు తెలుస్తున్నది.

వాక్యాంలో దేశకాల బోధకాలైన పదబంధాలుకూడా ఉంటై. ఇవికాక కొన్ని రకాల క్రియావిశేషణాలు, కారకబంధాలు కూడా ఉండవచ్చు. కర్తృకారకం కాక మిగతా కారకాల్ని సూచించే పదబంధాలు ఆఖ్యాత బంధంలో భాగాలుగా ఇక్కడ పరిగణించబడుతున్నై. వీటిల్లో కర్మకారకాన్ని బోధించే పదం కర్మపదం. మిగతావి కరణ, అధికరణాది కారకాలను బోధించే పదబంధాలు. పైన పేర్కొన్న పదాలన్ని ఒకే సామాన్య వాక్యంలో రావడానికి వీలుంది. ఇట్లావచ్చినప్పుడు ఈ పదాలస్థానం క్రమ నిరపేక్షకం కాదు. కర్తృపదం వాక్యాదిని, క్రియాపదం