పుట:తెలుగు వాక్యం.pdf/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సామాన్య వాక్యాలు

9

వాక్యాంతంలో వస్తుందని పూర్వమే తెలుసుకున్నాము. కర్మపదం క్రియకు పూర్వం ఉంటుంది. అముఖ్య కర్మపదం ముఖ్యకర్మకంటే ముందు వస్తుంది. దానికంటే ముందు స్థలబోధక పదం, దానికంటే ముందు కాలబోధకపదం వస్తై. క్రియావిశేషణం క్రియకంటే ముందు, కర్మపదం తర్వాత వస్తుంది. ఈ పదాల వరస పైన చెప్పిన పద్ధతిలోవస్తే ఇందులో ఏ పదానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉండదు. ప్రత్యేకమైన ప్రాధాన్యాన్ని చెప్పవలసి వచ్చినపుడు ఆ పదాన్ని క్రియాపదానికి సన్నిహితంగా జరపటం ఒక పద్ధతి. ఉదాహరణకు ఈ క్రింది వాక్యాలను పరిశీలిస్తే ఈ ప్రాధాన్యం తెలుస్తుంది.

(17)

a. నేను రేపు మద్రాసులో అరవ సినిమాకి వెళతాను.
b. నేను మద్రాసులో అరవ సినిమాకి రేపు వెళతాను.
c. నేను రేపు అరవసినిమాకి మద్రాసులో వెళతాను.

పై వాక్యాల్ని పరిశీలిస్తే మొదటిది సాధారణంగా ఉండే పదక్రమం అని, దానికి వ్యతిక్రమం జరిగినపుడు క్రియాపదానికి సన్నిహితంగా ఉన్నపదం కొంత ఎక్కువ ప్రాధాన్యం వహిస్తుందని తెలుస్తుంది. క్రియాపదం. సాన్నిహిత్యం ఈ ప్రాధాన్యానికి కారణం. ఒక్కోసారి కర్తృపదం కూడా క్రియాపద సన్నిహిత మైనపుడు అధిక ప్రాధాన్యాన్ని వహిస్తుంది.

(18)

a. కిట్టు పకోడీలు తిన్నాడు.
b. పకోడీలు కిట్టు తిన్నాడు.

ఈ రెండు వాక్యాలలో మొదటిది సాధారణ పదక్రమం. దీనికి వ్యతిక్రమం జరిగినప్పుడు కర్తృపదానికి ప్రత్యేక ప్రాధాన్యం వస్తున్నది. మొదటి వాక్యంలో ఒక మనిషి ఒక వ్యాపారం చేసినట్లు మాత్రమే సూచితమయింది. రెండో వాక్యంలో వ్యాపారాశ్రయమైన నామం నిర్దిష్టమైంది. అంటే రెండో వాక్యానికి 'పకోడీలు తిన్నది కిట్టు, మరొకరు కాదు' అన్న అర్థం ఉంది. మొదటి వాక్యంలో అట్లాంటి అర్థం లేదు. మొదటి వాక్యంలో 'పకోడీలు ఇంకొకరు కూడా తిని ఉండవచ్చు' అన్న భావం ఉంది. దీన్ని ఉద్దేశ్యవిధేయ పద్ధతిలోకూడా చెప్పవచ్చు. మొదటి వాక్యంలో కిట్టు ఉద్దేశ్యం. రెండవ వాక్యంలో పకోడీలు ఉద్దేశం. రెండు వాక్యాలలోను కర్త ఒకటే. అది కిట్టు అనే నామపదం. దీన్నిబట్టి తెలుగులో పదక్రమ వ్యత్యయం వల్ల ఉద్దేశ్య విధేయాలు మారతాయని, క్రియాపదానికి సన్నిహితంగా జరిగిన నామానికి