పుట:తెలుగు వాక్యం.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

x

ఒకచోట కూరిస్తే తెలుసుకోదల్చుకున్న వాళ్లకు, మరింత కృషి చేయ్యదల్చుకున్న వాళ్లకూ ఉపయోగిస్తుంది గదా అని ఈ సాహసానికి పూనుకున్నాను. ఇంకా కొన్నేండ్లు కృషిచేస్తే ఇంతకన్నా సమగ్రమైన, విపులమైన పెద్దపుస్తకం రాయటానికి వీలుపడొచ్చు. ఇంతకుముందే సూచించినట్టుగ ఈ పుస్తకంలో ప్రతిపాదించిన విషయాలు శాశ్వత సత్యాలనే భ్రమ (అసలు శాశ్వత సత్యాలనేవి ఉంటే) నాకు లేదు.


దారిన నడుస్తున్నప్పుడో, ఏ అల్పాహారమో పానీయమో సేవిస్తున్నప్పుడో శాస్త్రవిషయాలను ముచ్చటించుకోటం భాషాపరిశోధకులకు అలవాటు. ఆ విధంగా తెలుగు వ్యాకరణాంశాలను గురించి మా గురువుగారూ (భద్రిరాజు కృష్ణమూర్తిగారు) నేనూ తరచు చర్చించుకుంటుంటాం. ఒకరి ప్రతిపాదనలకు ఇంకొకరు విరుద్ధోదాహరణలు చూపించటం ఆ చర్చల్లో ఒక భాగం. దానివల్ల సూత్రీకరణలు పదును దేరతై. ఈ పుస్తకంలో చేసిన కొన్ని సూత్రీకరణలకు అట్లాంటి లాభం జరిగింది. ఫలానివని ఇప్పుడు వేరు చెయ్యటం కష్టమైనా, క్త్వార్థక వాక్యాల్ని గురించి, నామ్నీకరణాల్ని గురించి చెప్పిన కొన్ని అంశాలు అట్లా బాగుపడ్డట్టు స్పష్టంగా గుర్తు. మిగతావాటికి కూడా అట్లాంటి లాభం జరిగితే అవికూడా నిస్సందేహంగా మెరుగయ్యేవే. కాని సమయాభావం అట్లా జరగనియ్యలేదు

విస్కాన్సిన్ యూనివర్సిటీ (మేడిసన్) లో ఒక పుష్కరం కిందట నేను భాషాశాస్త్రం చదువుకొనేటప్పుడు జెరల్డ్ కెలీ గారు నాకు ఉపాధ్యాయులు. తెలుగు భాషను ఆధునిక పద్ధతుల్లో పరిశీలిస్తూ ఆయన అమెరికన్ విద్యార్థులకు పాఠాలు చెపుతుండేవారు. ఉద్యోగరీత్యా నేనా క్లాసుల్లో కూర్చునే అవసరం కలిగింది. ఆ తరవాత అట్లాంటి క్లాసులు పూర్తిగా నాకే వదిలేసేవారు. అప్పుడు విద్యార్థుల ప్రశ్నలకు సమాధానా లియ్యటంకోసమైన సొంతంగా ఆలోచించాల్సి వచ్చేది. ఈ విధంగా తెలుగుభాషా నిర్మాణాన్ని గురించి శాస్త్రీయంగా ఆలోంచిచటానికి నాకు దారిచూపి ప్రేరణ కలిగించిన ఉపాధ్యాయులు కెలీగారికి ఈ పుస్తకం అంకితమియ్యటం ఈ సందర్భంలో ఆయన్ను గుర్తుచేసుకోటం కోసమే గాని ఇది ఆయనకు అంకితమియ్యదగిన ఉద్గ్రంథం అనే ఉద్దేశంతో కాదు.

కెలీగారు 1963 నుంచి కోర్నెల్ యూనివర్సిటీలో భాషా శాస్త్రాచార్యులుగా ఉంటున్నారు.