ix
నిర్మాణంలో ప్రాచీననాధునికభాషలమధ్య భేదం స్వల్పం. అందువల్ల ఈ సూత్రీకరణలలో చాలావరకు ప్రాచీనభాషకుకూడా వర్తిస్తై. అది సూచించటానికి అందుబాటులో ఉన్న ప్రాచీనాధునిక రచనల్లోనుంచి కొన్ని ప్రయోగాల్ని అక్కడక్కడ ఉదాహరించాను. కొన్ని సూత్రీకరణలు ఇతర ద్రావిడ భాషలకు కూడా వర్తించవచ్చు. భాషలమధ్య వాక్యనిర్మాణ విషయంలో అధికసామ్యం ఉండటమే ఇందుక్కారణం.
ఈ రచనలో అక్కడక్కడ కర్మణి వాక్యాలను ప్రయోగించాను. కర్మణి వాక్యాలమీద నాకు ప్రత్యేకమైన మోజేమీలేదు. అకారణమైన ద్వేషమూ లేదు. సకర్మక వాక్యాల్లో కర్తృప్రాధాన్యాన్ని తగ్గించటానికి భాషలు అనుసరించే ఒక పద్ధతి కర్మణి ప్రయోగం. ఇది ఇతర మార్గాలద్వారా సాధించవచ్చు గాని, తెలుగులో క్రియా విభక్తులు అందుకు ఆటంకం. రచనా భాషలో, ముఖ్యంగా పరిశోధనా వ్యాసంగంలో ఉత్తమ పురుష కర్తృక వాక్యబాహుళ్యం తప్పించుకోటం కష్టం. ఒక్కోసారి ఆ వాక్యాలు రచయిత అభీష్టానికి విరుద్ధంగా అహంకార ద్యోతకాలు కావచ్చు. ఆ ప్రమాదం నుంచి కాపాడు కోటానికి కర్మణి వాక్యాలు రచయితలకు కవచాల్లాంటివి. ఆ ఉద్దేశంతోటే ఈ పుస్తక రచనలో కర్మణి వాక్యాలు వాడబడినై .
ఈ రచనలో సంస్కృత పద బాహుళ్యాన్ని కూడా ఆయిష్టంగానే గుర్తించాను. తెలుగు వ్యాకరణ సంప్రదాయం మంచికో, చెడ్డకో సంస్కృత మార్గంలోనే మొదలయి పెరుగుతూ వచ్చింది. ఆ సంబంధాన్ని ఇవాళ ఆమాంతంగా తెంచుకోటం అంత సులభంగా సాధ్యమయ్యేది గాదు. అందువల్ల ఇందులో కొత్తగా వాడిన పరిభాషకూడా ఆ మార్గంలో తయారుచేసిందే. సమాస కల్పనలో, సరూప సంగ్రహ పదనిర్మాణంలో సంస్కృత భాషలో ఉన్న సౌకర్యమే బహుశా ఇందుక్కారణ మనుకుంటాను.
ఈ పుస్తకంలో ఏ అధ్యాయమూ ఏమాత్రం సమగ్రం కాదని ఎవరైనా
వెంటనే గ్రహించగలరు. ఏ రెండు ఉదాహృత వాక్యాలను తీసుకున్నా, మళ్ళీ
ఇంతకు రెండింతలు గ్రంథం రాయొచ్చు. అంటే నేను రాయగలనని కాదు. అంత
విషయం ఉంటుందని. తెలుగు వాక్యాన్ని గురించి ఇంతవరకు తెలుగులో ఒకపాటి
పుస్తకమైనా లేనందువల్ల, అసమగ్రంగా నైనా ఇప్పటివరకు గ్రహించినంత మట్టుకు