పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 06-6 వరాళి సం: 10-035

పల్లవి:

వలుపేమి దాఁగునా వన్నెకాఁడ
అలవడి నీ వెంత అణఁచఁ జూచినను

చ. 1:

గక్కన మొక్కకుంటేను కాంత నిన్ను దీవించునా
తక్కి మాతో సిగ్గువడి దాఁచేవు గాక
చక్కఁగా నవ్వ కుండితె సరసము లాడునా
లెక్కించి మాకు వెఱచి లే దనేవు గాకా

చ. 2:

చెనకక నీ వుంటె చెలి పూవుల వేసునా
పొనిగి మాతో లేదని బొంకేవు గాక
గునిసి యరువకుంటె కొంగు నిన్నుఁ బట్టునా
తనివోని నీననుపు దాఁచేవు గాకా

చ. 3:

కన్నుసన్న సేయ కుంటె కాఁగిట నిన్నుఁ బట్టునా
అన్నిటా మాతోడుతఁ దోశాడేవు గాక
వెన్నడించి యాపెను శ్రీవెంకటనాథుఁడ కూడి
మన్నించితి నన్ను నిట్టె మండెమురాయఁడవె.