పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 04-4 మేసబౌళి సం: 10-021

పల్లవి:

సింగారపు మేనిచెలువరి యింత
చెంగలింతురా చెలువరీ

చ. 1:

నెఱతనా లూరకె నెరపుచు యిట్టె
చిఱునవ్వు నవ్వేవు చెలువరీ
తఱి నగి నగి వాని దగిలీని అంత
చెఱఁగు ముట్టకువోయి చెలువరీ

చ. 2:

నిలువున మోహము నింపుచు మాపై
చిలికించేవు చూపు చెలువరీ
నెలవైన మాఁటలె నిజ మయ్యీని మాకు
శెలవు సేయకు వోయి చెలువరీ

చ. 3:

వొక్కటిమాఁటల నొడఁబరచి నా
చెక్కు నొక్కకు వోయి చెలువరీ
గక్కన శ్రీవెంకటనాథుఁడా నీకు
జిక్కితి కాఁగిట చెలువరీ.