పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 04-1 కాంభోది సం: 10-018

పల్లవి:

నాలితనా లేఁటికోయి నారసింహుఁడా
నాలోనె నవ్వు వచ్చీ నారసింహుఁడా

చ. 1:

చేరువని ప్రియములు చెప్పి చెప్పి నామీఁద
నారువోసేవు వలపు నారసింహుఁడా
దారాసుద్దవుమాఁటలు తాఁకనాడి మదనుని
నారసాలు సేయకు నారసింహుఁడా

చ. 2:

వెనుకొని నా వెంట వెంటఁ దిరిగి నామీఁద
ననుపు మోపు గట్టేవు నారసింహుఁడా
కనుచూపూలనె వట్టి కాఁక రేచి మెత్తనైన
ననలు వాఁడి సేయకు నారసింహుఁడా

చ. 3:

చిలుకుగోళ్ల నన్నుఁ జెనకుచు నీపై నా
నలు వెట్టె వచ్చేవు నారసింహుఁడా
కలికితనాన శ్రీవెంకటనాథ కూడితివి
నలువై వోగునూతుల నారసింహుఁడా