పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0007-06 రామక్రియ సం: 10-042

పల్లవి:

మాయలో మునుఁగ నేల మమత లేల
చేయరా దేవుఁ డీపాటి సేయ నోపఁడా

చ. 1:

అట్టె దేహసమ్మంధ మాసపడేజీవులాల
పట్టి హరిసమ్మంధాన బ్రదుకరాదా
నెట్టన సర్వాంతరాత్మైనిలుచున్న దేవుఁడిట్టె
చుట్టాలపక్కాలపాటి శుభ మియ్య నోపఁడా

చ. 2:

మోసపోక ధనధాన్యములు గూర్చే దేహులాల
వేసరక విష్ణుభక్తి వెదకరాదా
రాసి కెక్క యిందరిని రక్షించేదేవుఁడె
కాసువీసములపాటి కావ నోపఁడా

చ. 3:

వెలయ రాజులను దీవించే ప్రాణులాల
కల శ్రీవెంకటనాథుఁ గానఁగ రాదా
వలె నని యిందరికి వరాలిచ్చే దేవుఁ డేమి
కొలువునిలువుపాటిగుణ మియ్య నోపఁడా