పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0006-01 గుజ్జరి సం: 10-031

పల్లవి:

వద్దుసుమ్మీ చెప్పితిని వలలఁ బడఁగ వద్దు
పెద్దరికాన దెవునిఁ బేరుకొన రాదా

చ. 1:

పల్లదపు సంసారానఁ బాయలేక తిరిగేవు
చెల్లఁబో జీవుఁడ యింకా సిగ్గు గాదుగా
వెల్లవిరి నింతయాల వెనకముందరిపాటు
దళ్లాలితనము మాని తలఁచుకో రాదా

చ. 2:

వెయ్యైనా మీఁద మీణద వేసరక కోరేవు
అయ్యో యింకా నిందు కాసపడేవా
వొయ్యనె వెనకజన్మ మొక్కటొక్క టెంచి చూచి
తియ్యని విష్ణుభక్తి తెలుసుకో రాదా

చ. 3:

యేపు మీరి యేమైనా నింపులు సేసుకొనేవు
పో పో యింకా రోఁత వుట్పదాయఁగా
చేపట్టి కాచేయట్టి శ్రీవెంకటనాథుఁడె
దాపై వున్నాఁ డిదె దరిసించ రాదా