ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. ఆ. రేకు: 0005-06 లలిత సం: 10-030
పల్లవి:
బండించితేఁ గలుగునా పరమాత్మునిదాస్యము
నిండుమతి నుండితేను నెరవేరుఁ గాక
చ. 1:
బాధకు నోపనివాఁడు పాపము సేయ నేల
పోది సేయఁ దొలుతేమి బుద్ధి లేదా
సాదువలె నుండితేను సర్వేశ్వరుఁడె తన్ను
వాదులాట లెల్ల మాన్పి వహించుకో లేఁడా
చ. 2:
దండుగ కోపనివాఁడు తప్పులు సేయఁగ నేల
వుండరాదా తా నుండె వొడికానను
కొండవంటి యాసతోడ కోరక తా నుండితేను
తండు ముండై లంపటాలు తగిలీనా తనకు
చ. 3:
వళుకు కోపనివాఁడు వచ్చి పూఁటవడ నేల
వొలిసినట్లు తనంత నుండరాదా
కలకాలము శ్రీవెంకటనాథుఁ గొలిచితె
అలరి యభయ మిచ్చి అట్టె కావ నోపఁడా