పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 19-3 దేవగాంధారి సం: 10-110

పల్లవి:

చల్లని చూపులవాని చక్కనివాని పీలి
చొల్లెపుఁ జుట్లవానిఁ జూపరమ్మ చెలులు

చ. 1:

వాడలోని చెలులను వలపించి వచ్చెనే వాడు
చేడెల మనసు దొంగ చిన్నికృష్ణుఁడు
యేడుగడయునుఁ దానై యెలయించె నన్నును వాని
జూడక వుండఁగ లేను చూపరమ్మ చెలులు

చ. 2:

మందలోని గొల్లెతల మరిగించి వచ్చెనే వాడు
సందడి పెండ్లికొడుకు జాణకృష్ణుఁడు
ముందు వెనకా నలమి మోహింపంచెనన్నును వాని
పొందులు మానఁగ లేను పోనీకురే చెలులు

చ. 3:

ఇంటింటి యింతులనెల్లా యెలయించి వచ్చెనే వాడు
దంటవాఁడు కవికిచేఁతల కృష్ణుఁడు
నంటునను శ్రీవెంకటనాథుఁడై నన్ను గూడెనే వాని
వొంటిఁ బాయలే నావద్ద నుంచరమ్మ చెలులు.