ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 19-4 పాడి సం: 10-111
పల్లవి:
బాలుఁడటవే సా దటవే వీఁడు పల్లదీఁడు గాక
కోలుముందై తనమాఁటలే గెలువ గొబ్బనఁదగవు చెప్పీనమ్మా
చ. 1:
పసులఁ బేయలఁ గూరిచీనమ్మా పాలు నేయినారగించీనమ్మా
పసిబిడ్డఁ డంటా నెట్టు నమ్మవచ్చు బాలకృష్ణురాయని
కొసరి కన్నులు గీఁటినమ్మా కొంగువ ట్టొయ్యనె తీసీనమ్మా
యిసుమంతలోనె కన్నుమొరఁగించి యిల్లిల్లు దప్పక తిరిగీనమ్మా
చ. 2:
నీరాటిరేవులఁ బొంచీనమ్మా నిక్కి నిక్కి తానెచూచీనమ్మా
వేరులేక యెట్టు దగ్గరుదము గోవిందకృష్ణురాయని
ఆరడితో నొడిదొడికీనమ్మా ఆనలువెట్టుచుఁ బోనీడమ్మా
వీరిడిమాయల నిందరినిఁ దాసు వెంట వెంట నేల తిప్పీనమ్మా
చ. 3:
వొంటినె కాఁగిట నించీనమ్మా వొయ్యనె కళలు రేంచీనమ్మా
నంటున మమ్మెల్లఁ గూడె శ్రీవెంకటనాథు కృష్ణరాయఁడు
జంటవలపులు చల్లీనమ్మా చలమున దక్కగొనె నోయమ్మా
బంటుగా నేలి అందరి మన్నించి పరిణామమున నున్నాఁ డమ్మా