Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 19-2 నాదరామక్రియ సం: 10-109

పల్లవి:

ఇన్నాళ్లు దా యేడ నుండెనమ్మ
వన్నెగాఁ గొసరవచ్చీ నేఁడు

చ. 1:

వేఁకపు విరహన వేఁగ లేక నేను
సోఁకఁగ నెదురు చూడఁగా
తాఁకి తలఁచఁడు తరుణులఁ గూడి
యేఁకట నిపుడు నే నిత వైతినా

చ. 2:

కడు నొంటిఁబొద్దు గడపఁగ లేక
వొడికపుటాసల నుండఁగా
తడవఁడు నన్ను దనయిచ్చలనే
అడరి యిప్పుడే నాపై ఆ వుట్టెనా

చ. 3:

గొప్పతమకానఁ గుందుచుండ లేక
అప్పుడె పిలువ నంపఁగా
కప్పి నన్ను శ్రీవెంకటనాథుఁడు గూడె
యిప్పుడు నారతు లింపు వుట్టెనా.