పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 11-6 శంకరాభరణం సం: 10-065

పల్లవి:

ఏఁటి కిఁక నాకు నీతో నెగ్గు లెంచను
మాఁటలాడినప్పుడె మానేనయ్యా కోపము

చ. 1:

మాన లేక నీవు పెక్కు మానినులఁ దెచ్చినాను
దాని కేమీ నేను పెద్దదాననె కానా
నాననట్టివలపులు నాఁడు నాఁడె చవులు గావా
సానఁ బట్టినమణులు చాయలె కావా

చ. 2:

పొందులె మానక నీ వేపొలఁతి యింటనుండినా
అందుకే మెపుడు నీకు నాలనే కదా
ముందు ముందె యిట్లానైన మోహములు తీపులే కా
యెందు నాఁక లైనవిందు యితవు లవునె కా

చ. 3:

కళలు మించ నీ వెవ్వతెఁ గాగిలించుకొన్నానేమి
బలిమి నైన నావరుస పాయవే కదా
చెలిమి సేసేనాటిబాస శ్రీవెంకటనాథ నీవు
తలఁచి కూడితి నాతోఁ దనియక వుందునా.