ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 12-1 బౌళి సం: 10-066
పల్లవి:
చిత్తమె చిమ్మి రేఁగితే సిగ్గేమి యెగ్గేమి
రుత్తవోని వేడుకల రుచి గన్నవారికి
చ. 1:
మొక్కలానఁ దిట్టినాను మోహమెపెచ్చువెరుగు
దక్క వలచినయట్టి తరితీపున
వుక్కుగోరు సోఁకినాను వుపచార మై తోఁచు
నిక్క మై సరస మాడ నేరిచినవారికి
చ. 2
కాలు దాఁకించిన నైన కళ లంటిన ట్లౌను
వేళమె మోహించినట్టి వేడుకను
పేలరి మాఁట లాడిన ప్రియములై తోఁచును
వాలాయించి నను పైనవారికిని
చ. 3:
ఎంగిలి సోఁకించినాను యిచ్చక మై తోఁచును
పొంగెటి తమకపు తీపులవేళను
చెంగలించె నీచెలియ శ్రీవెంకటనాథుఁ గూడి
అంగ మైన మండెమురాయఁడె తానై యుండఁగా