ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 11-5 రామక్రియ సం: 10-064
పల్లవి:
పించెపుతలజడల పిన్నవాడు
పెంచీనె వలపులు పిన్నవాఁడు
చ. 1:
చనవరివలెనె వేసాలచేఁతలు సేసి
పెనఁగీ గుచములతోఁ బిన్నవాఁడు
ఘన మై ముద్దులు చూపి కరఁగించియింతలోనె
పెనపులఁ బెట్టీనె పిన్నవాఁడు
చ. 2:
చెలిమికానివలెనె సిగ్గు వీడ మాఁటలాడి
పిలిచీ యేకతానకుఁ బిన్న వాఁడు
కులమువావులు చెప్పి గుట్టు దెలుసుక నాతో
పెలుచుమాఁట లాడీనె పిన్నవాఁడు
చ. 3:
చిట్టకపు చేఁతలను చెనకి నావేలఁ దెచ్చి
పెట్టినె వుంగరము పిన్నవాఁడు
గట్టిగాఁ దానె శ్రీవెంకటనాథుఁ డై వచ్చి
బెట్టుగా నన్నుఁగూడెనే పిన్నవాఁడు.