పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 10-4 నాదరామక్రియ సం: 10-057

పల్లవి:

వేగిరమా నీవు విభుఁడవు నీ వెలఁదిని నేను
సోగకన్నుల నీసొలపు జూపులసొంపు నాకుఁ జాలదా

చ. 1:

చెలియ మునుపు సింగారించుకొన్న చెంగావిచీర యిది నీవు
తలఁకక నేడు దట్టిగట్టుకొంటె దాని కేమిదోసమా
అలిగేనా నేను అందుండె మాఁటాడు అంటుకొన నోపను అది
తలఁగ వేరొక్క తావునఁ బెట్టిరా దగ్గరుందు గాకి

చ. 2:

కందువతో నాపె కస్తూరి వూయఁగ గట్టిబేఁటులు రాలితే నీవు
పొందు చెడకుండ బొట్టు వెట్టుకొంటె బోగానకుఁ గడమా
నింద నిన్నాడేనా నేటి కటుండరా నే నందు కోరువనువొక
చందానఁ బన్నీట జలక మాడి నాసంగడికి రారా

చ. 3:

ముద్దియ వేలనె ముందర నుండెటి ముద్దురవుంగరమునీవు
పెద్దరికానకు ప్రియమునఁ గేల బెట్టుకొంటెఁ దగదా
గద్దరివై శ్రీవెంకటనాథ నన్నుఁ గరఁగించి కూడితి నా
వద్దనె పాయక వాలాయించి దేవరవలె నుండరా.