పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0217-1 సామంతం సంపుటం: 08-097

పల్లవి:

వెన్న చేఁతబట్టుకొని వేఁడనేలే నేతికి
కన్నుచూపుల నతని గంపఁగమ్మనేరవా

చ. 1:

చేరి చేయిచేఁత బట్టి సిగ్గున బాసడిగేవు
పోరచి నీవిభుఁడెందు వోయీనే యింక
సారెకు నీపయ్యదలో చన్నులు దాఁచినట్టు
తారసిల్లి రమణుని దాఁచనేరవా

చ. 2:

వొంటిఁ జిక్కించుక నీవు వొట్టు వెట్టుకొమ్మనేవు
దంటయై వేరొకతెను తగిలీనట్టే
గంటువేసి‌ పోఁకముడి గట్టిగాఁ గట్టినయట్టు
వొంటిగాకుండా నాతని వొడిఁగట్టనేరవా

చ. 3:

మొక్కలానఁ గాఁగిలించి మోవిముద్రలు వెట్టేవు
వెక్కసా శ్రీవేంకటగోవిందుఁడు నీకు
వొక్కమాటే కంఠహారమురమునఁ గట్టినట్టు
చక్కని నీమేనితోడ జంటసేయ నేరవా