పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0217-2 సాళంగనాట సంపుటం: 08-098

పల్లవి:

ఇద్దర సరిగెలువ నింతలోనే జూజమా
వొద్దికై వొకరొకరు వూరకుంట గాక

చ. 1:

సలిగెమాటాడితేను సాదించేవారు గలరా
వొలుగులు వారఁగ నవ్వుదురుగాక
చెలిపంతమేమాడినా చెల్లించఁగవలదా
బలిమి నీవింతలోనే పచారించవలెనా

చ. 2:

కొంగువట్టి తీసితేను కోపగింతురాయేమి
అంగవించి అందుకు లోనౌదురుగాక
అంగనల చేఁతలకు అంగీకరించవలదా
సంగతితో నీరాజసము చూపవలెనా

చ. 3:

అక్కున నిన్నదిమితే నప్పుడ జంకింతురా
చెక్కు నొక్కి కరఁగి మెచ్చింతురుగాక
యెక్కువ శ్రీవేంకటేశ ఈపె నిన్నుఁ గూడెనిట్టె
పిక్కటిల్లు నీనేర్పులఁ బెనఁగఁగవలెనా