పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0216-6 ముఖారి సంపుటం: 08-096

పల్లవి:

పువ్వుల వేసినవారిఁ బూఁపల వేతురటవే
నివ్వటిల్ల మీలోమాట నీవేయెఱఁగవా

చ. 1:

చేసన్న సేసినందుకు సెలవియ్యవలెఁగాక
మాసటీనివలె మారుమలయనేలె
ఆసపడ్డవేళ నీవు అంగీకరించకవుంటే
దోసమందురదినీవు తొల్లేయెఱఁగవా

చ. 2:

చెంతఁ గూచుండినందుకు సేసవెట్టవలెఁగాక
పంతగత్తెవలె మారుపలుకకువే
మంతనమైనవేళ మరఁగులు వెట్టితేను
జంతందురు లోకులజాడ నీవెఱఁగవా

చ. 3:

ఇట్టెకూడినందుకును యిచ్చగించవలెఁగాక
జట్టిబేరగానివలె సటలేఁటికే
గుట్టుతో శ్రీవేంకటేశుఁ గూడియుఁ గొరితేను
దిట్టతనమందురు యీతెరఁగులెఱఁగవా