పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0216-1 గౌళ సంపుటం: 08-091

పల్లవి:

ఏమిచూచేవు మాదిక్కు యివియేమేలు
నీమనసే యెరుఁగును నీవు సేసేమేలు

చ. 1:

మాటకుమాటాడఁబోతే మరియెన్నైనాఁ గలవు
మోటుపెట్టి నేము నీకు మొక్కేదే మేలు
పాటించి సతులకెల్లా పైఁడికొంగువరచిన
మేటివి నిన్నెందుకైనా మెచ్చేదే మేలు

చ. 2:

చేఁతకుఁజేఁత సేసితేఁ జిక్కులెన్నైనాఁ గలవు
నాఁతినింతే నిలుచుండి నవ్వేదేమేలు
కాఁతాళించి చెలులకే గద్దెవెట్టితివురము
పూఁతవలపులనిన్నుఁ బొగడేదే మేలు

చ. 3:

సేసకును సేసచల్లఁ జేయికిఁ జేయి గలదు
పోసరించి నీకాఁగిటఁ బొందేదే మేలు
ఆల శ్రీవేంకటేశ అలమేల్‌మంగను నేను
మోసపోక కూడితిమి మోహములే మేలు