పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0211-1 ఆహిరి సంపుటం: 08-061

పల్లవి:

ఏఁటి బుద్దులు చెప్పేరే యింకా నాకు
మాఁటలాడుటగాక మచ్చుచల్లేదా

చ. 1:

పతిఁబాసిన నేరమి పైకొని నాకుండఁగాను
అతనినెంతేసి మాఁటలాడుమనేరే
మతిలోని నామంకే మళ్ళవేకొని కొంత
వెతదీర్చుకొంటగాక వేగిరించేదా

చ. 2:

పంతమాడిన గర్వపుబలిమి నాకుండఁగాను
రంతుల నాతనినెట్టు రవ్వసేతునే
వంత నా వల్ల వచ్చిన వగపల్లాఁబెడఁబాయ
చింతదీర్చుకొంట గాక సిగ్గువడేదా

చ. 3:

కాఁగిటఁ గూడినయట్టి ఘనత నాకుండఁగాను
ఆఁగుచు నాతనినెట్టు అలయింతునే
తోఁగిన చెమటలాడ తోడనే శ్రీవేంకటేశు
రేఁగి నవ్వించుటగాక రిచ్చవడేదా