పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0211-2 దేసాళం సంపుటం: 08-062

పల్లవి:

విన్నపము లిఁకనేల వేగినంతాను
మన్నించకిఁకనుంటే మఱియేది త్రాణ

చ. 1:

కాంతకు నీవు చూచిన కనుచూపులే త్రాణ
మంతనాన నీవాడిన మాటలే త్రాణ
పొంత నీపై తలపోఁత పొద్దువోకలే త్రాణ
యింతట నీవురాకున్ననిఁకనేది త్రాణ

చ. 2:

నలినాక్షికపుడు నీ నవ్విన నవ్వులే త్రాణ
పలుమారుఁ జేసినట్టి బాసలే త్రాణ
పొలసి నీవువేసిన పువ్వులచెండే త్రాణ
పిలుపించకిఁకనుంటే పిక్కటిల్లుఁ ద్రాణ

చ. 3:

సతికి నీకూటమిలో చనవిచ్చుటలె త్రాణ
వ్రతముగా నీవింటికి వచ్చుటే త్రాణ
గతియై శ్రీవేంకటేశ కాఁగిలించి నదె త్రాణ
తతినిట్టె కూడకుంటే తగనేది త్రాణ