పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0209-4 రామక్రియ సంపుటం: 08-052

పల్లవి:

నీమనసాపె యెరుఁగు నిక్కముగాను
గామిడితనానఁగాని కలుగదు వలపు

చ. 1:

చెక్కు నొక్కి నీవు ముందు చేయివట్టి తీయుదాఁకా
అక్కడనే నిలుచుండె నాపె సాదించి
నిక్కము నింతేసిసేయ నేరిచినవారికిఁగా
చిక్కి చేతికిని లోనై సిద్దించు వలపు

చ. 2:

ననుపున నీవింతేసి నవ్వులు నవ్వినదాఁక
అనువుగా మాటలాడె నాపె సాదించి
పెనఁగేటి యిటువంటి బేసబెల్లివారికేకా
వెనకముందరికెల్లా వెలవెట్టు వలపు

చ. 3:

కందువల నీవుగూడిన కరగించిన దాఁకా
అందాన వేళలు గాచె నాపె సాదించి
యిందునే శ్రీవేంకటేశ యిటువంటివారికిఁగా
సందడించి మీయందే సరిదాఁకె వలపు