పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0208-3 హిందోళవసంతం సంపుటం: 08-045

పల్లవి:

మనసెరిఁగినకల్ల మానుపరాదు
యెనలేనిదొరవు నీవేమిసేతువయ్యా

చ. 1:

దప్పిగొంటివని నీకు దయదలంచితిఁగాక
చిప్పిలి యేపనులో చేసితివంటినా
రెప్పలెత్తి చూచేవు రేసలువుట్టఁ దిట్టేవు
నెప్పున నామోము చూచి నీకేల కలఁగ

చ. 2:

కళలు నీమోముననే కానవచ్చీనంటిఁగాక
సొలసి నీరతులలో చొప్పులెత్తేనా
చలముల జంకించేవు సన్నలను సాదించేవు
నెలవై నాయిచ్చలకు నీకేల కలఁగ

చ. 3:

నేరుపరివౌదువని నిన్ను నేమెచ్చితిఁగాక
తారుకాణ సేసి మాట తగిలించేనా
యీరతి శ్రీవేంకటేశ యెనసితివిటునన్ను
నీరచనకు నవ్వితే నీకేల కలఁగ