పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0208-4 శంకరాభరణం సంపుటం: 08-046

పల్లవి:

తానేడ ఆతఁడేడ దయలు దలఁచ వచ్చీ
యీనెపానఁ గంటిమిగా యివిగొన్ని సుద్దులు

చ. 1:

నగుతా నాతనినంటే నాతో నీపె వాదించీ
తగవు చెప్పరే మీరు తనమగఁడా
జిగితో నేనేకతానఁ జేసేటి చేఁతలవేళ
అగపడి తానప్పుడడ్డాలువచ్చీనా

చ. 2:

కొప్పు నేజారఁదీసితే కురులు దాఁగూడదువ్వీ
తప్పక చెప్పరే మీరు తనమగఁడా
చిప్పిలు రతులలోనఁ జీకాకు సేసేటివేళ
అప్పటివలెనే తావహించుకవచ్చీనా

చ. 3:

చెమరించ నేఁగూడితే చేరి తావిసరవచ్చీ
తమకించక చెప్పరే తనమగఁడా
జమళి శ్రీవేంకటేశు సాదించేటి యట్టివేళ
గమిగూడుకొని తాను కావఁగవచ్చీనా