పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0207-4 నాట సంపుటం: 08-040

పల్లవి:

ఎంతసటకాఁడవో యెవ్వరి నెలయించేవు
చింతించితే నాకైతే చిమ్మిరేఁగీఁ గోపము

చ. 1:

కన్నుల జంకించేవు కడుసోఁకనాడితేను
సన్నలు సేసేవు నీవు సాదించితేను
యిన్నిటా సోఁకనాడితే యెట్లానయ్యానీకు
నిన్నుఁజూచి నాకైతే నిండుకొలది గోపము

చ. 2:

చేయిచేతదిమేపు సెలవుల నవ్వితేను
కాయము సోదించితే యేకతమాడేవు
ఆయాలు నేఁదడివితే నలుపేల వచ్చెనీకు
మాయలుచూచి నాకైతే మక్కళింనీఁ గోపము

చ. 3:

నించేవు కాఁగిటను నిన్నుఁజూచి నవ్వితేను
మంచముపైకిఁదీసితే మన్నించేవు
యెంచఁగ శ్రీవేంకటేశ యింపులెట్లాయనీకు
అందలమోవిగంటికి నందుకొనీఁ గోపము