పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0207-3 భైరవి సంపుటం: 08-039

పల్లవి:

నీకునీకే యేలికవు నేనంటినా
కాకరివిద్యలఁ బొంది కరఁగేవుగాక

చ. 1:

తీయని నామోవిమీఁద తేనెల తీపులేకాక
వోయయ్య ఆమాటలలో వొగరున్నదా
నీయంతనీవు సేసేటి నెరసులచేఁతలలో
పాయక వెంగేలుంద భ్రమసేవుగాక

చ. 2:

కన్నుల నాచూపులలో కమ్మిన తేటలేకాక
యెన్నటికెన్నటి సుద్ది యెఱ్ఱనున్నవా
నిన్న మొన్న నించుకొన్న నీమేనిరేకలు చూచి
పన్ని వొక్కటొక్కటే భావించేవుగాక

చ. 3:

నెట్టన నాచేఁతలలో నిండు సరసమేకాక
గట్టివజ్రపుగోళ్ళ ఘాతలున్నవా
యిట్టె శ్రీవేంకటేశ యెనసితివిటునన్ను
గుట్టున నవియూనిదీ గూడించేవుగాక