పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0206-5 రీతి గౌళ సంపుటం: 08-035

పల్లవి:

నెయ్యని పోసుకోరాదు నీళ్ళని చల్లఁగరాదు
చెయ్యారఁగంటిమి నేఁడు చేరి నితోపొందులు

చ. 1:

ప్రేమము చాలాఁజేసి పెక్కుసతుల నీతోను
మోముచూడ సిగ్గువడి ముసుఁగుతోనున్నదాన
జామువోయి వచ్చి నీవు సరసములాడేవు
యేమని నేనియ్యకొందు నేఁటిజన్మమయ్య

చ. 2:

పలుమారు నీతోనవ్వి పరాకై వుండిన నీతో
పలుకఁగ సిగ్గుపడి భావింపుచునున్నదాన
కలగన్నట్లావచ్చి కందువలంటేవు నన్ను
బలిమి యేమున్నది నాబదుకు నీచేతిది

చ. 3:

మచ్చికతో నిన్నుఁ గూడి మన్నించిన నీతోను
పచ్చిసేయ సిగ్గువడి పదరక వున్నదాన
యెచ్చుగా శ్రీవేంకటేశ యిట్టె నన్నునేలితివి
విచ్చన విడాయ నా విభుఁవములెల్లను