పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0206-4 సామంతం సంపుటం: 08-034

పల్లవి:

కోరి నీకు నీయందే గుక్కిళ్ళున్నవి
యేరీతైనాఁ జేయవచ్చునేమి గొరతయ్యా

చ. 1:

పయ్యదలో నీచెలికి పసిఁడిబిందెలున్నవి
తియ్యని మోవిలోన తేనెలున్నవి
ఆయ్యెడ మాటల బెల్లాలప్పటిఁ గొన్ని వున్నవి
యెయ్యెడఁ జూచిన నీకు యేమి గొరతయ్యా

చ. 2:

చెంది యాపెమోములోనే చెక్కుటద్దములున్నవి
కందువచూపు ముత్యాల గనులున్నవి
మందలించిన కాఁగిట మర్మములెల్లానున్నవి
యెందునైనా నీసిరులే యేమిగొరతయ్యా

చ. 3:

అవిగో కమ్మని వూర్పులాలవట్టములున్నవి
తవిలిన రతుల నిధానమున్నది
కవగూడితిరి శ్రీ వెంకటరాయ మీరిద్దరు
యివలఁ జూచిన మరియేమి గొరతయ్యా