పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0250-5 ముఖారి సంపుటం: 08-299

పల్లవి:

ఏఁటికి బాఁతిపడేవు యేల మమ్ముఁ జెనకేవు
కాటుకవన్నెచూపులు కలవి మాజూబులు

చ. 1:

కన్నులె గొప్పలుగాని కడుఁ గొంచపు మొకము
యెన్నఁగ మాచక్కఁదన మేమున్నది
వున్నతాలె కుచములు వొంటినడుము సన్నము
యెన్ని చూడఁబోతేను యిదివో మాసొబగు

చ. 2:

బారెఁడె కురులుగాని చేరఁడేసి పాదాలు
యీరీతిదె మాగుట్టు యేమున్నది
నోరు మాణిక్యాలగని నొక్కితేఁ దేనెపెదవి
పేరుకొనఁబోతేను పెలుచు మాగుణము

చ. 3:

చేతులె మెత్తనగాని చిమ్ము గోళ్ళు కఠినాలు
యేతులు నెమ్మెలు మాయందేమున్నది
ఘాతల శ్రీవెంకటేశ కలసితి విటునన్ను
నీతి విచారించుకొంటే నిండెను నీమన్ననే