పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0201-2 హిందోళవసంతం సంపుటం: 08-002

పల్లవి:

తనమాటే నిజము తా బొంకినా
తనువంటినంతలోనే తాపమారీనా

చ. 1:

తప్పక చూచినవాఁడు తలవంచుకొననేలే
నెప్పుదాఁక గురులేసి నేఁ గాననీనా
అప్పటి నే నొలయఁగ నాయములంటీ తాను
కొప్పుజారినంతలోనే కోపమారీనా

చ. 2:

తగులనాడినవాఁడు తప్పుదిద్దుకొననేలే
నిగిడి మేడెము చొచ్చి నేఁ గాననీనా
జిగి నా మొగమోటకు చేతులు చాఁచీ తాను
గగురుపొడిచితేనే కాఁకలారీనా

చ. 3:

మచ్చికె చేసినవాఁడు మంకులు నెరపనేలే
నెచ్చెలి సాకిరివెట్టి నేఁ గాననీనా
అచ్చపు శ్రీవేంకటేశుఁడన్నిటాను నన్నునేలె
రచ్చకెక్కెనిఁక తాను రాకుండీనా