పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0201-3 నారణి సంపుటం: 08-003

పల్లవి:

ఏల బుద్దులు చెప్పేరే యింతలో నాకు
మేలిమి విభుఁనితోడ మేకులేలే

చ. 1:

తన మాటలు చెల్లించి తగవులనే చెల్లించి (?)
చనవే చేకొందుఁగాక జగడాలేలే
పెఁనగినట్టే పెనఁగి ప్రియములలో మునిఁగి
మనసు దెలిసేఁ గాక మరియాలే

చ. 2:

మాటలెల్లా నూఁకొని మచ్చికెల్లాఁ జేకొని
పాటలు పాడుదుఁ గాక పదరనేలే
కాటుకకన్నులఁ జూచి కందువవేళలు గాచి
చాటి చెప్పేఁగాక యిఁక జాగులేలే

చ. 3:

కరఁగినట్టే కరఁగి కరతలెల్లా మొరఁగి
సిరులఁ గూడుదుఁ గాక చింతలేలే
యిరవై శ్రీవేంకటేశుఁడెనసెఁ దానే నన్ను
తొరలించుకొందుఁ గాక తోయనేలే