పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0248-6 సౌరాష్ట్రం సంపుటం: 08-288

పల్లవి:

ఏల సాకిరి గోరేరు యిద్దరు నన్ను
నాలి నేఁ జూచినప్పుడె నవ్వుతానె వుంటిరి

చ. 1:

మతకా లెరఁగఁగాని మగువ నీమోముచూచి
చతురతలు మెరసి జంకించెను
రతికి దగ్గరఁగాని రహస్యాన నీవుండి
మితిమీరి కొనగోరు మీటుకొంటివి

చ. 2:

తగవులు చెప్పఁగాని తరుణి నీవన్నందుకు
వొగరుఁజూపుల పెదవులఁ దిట్టెను
మిగిలినవేవోకాని మీదమిక్కిలి నీవైతె
జిగిఁ బంతములు చూపి చెలఁగితివి

చ. 3:

యీరీతి వేరుసేయఁగా నింతి శ్రీవెంకటేశ్వర
గారవించి నిన్నుఁ గూడి కాఁగిలించెను
తేరెఁగాని నీవల్లనె తేటతెల్లమై నేఁడు
మేరతోనె పంతమిచ్చి మేకొంటివి