పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0245-5 వరాళి సంపుటం; 08-269

పల్లవి:

వలపు నీరువంటిది వాడరాదు
తలఁపు మాకిద్దరికె తారుకాణైవుండును

చ. 1:

మలసి ఆతఁడాడిన మాటలు నాతోఁ జెప్పి
చలము రేఁచకురె సతులాల
తెలిసితి నేఁ దొల్లె తేనె(లె?) పొన్నాకుమీఁ దిదె
మెలఁగి నేఁడు గొత్తలు మీకింతె కాని

చ. 2:

యిదివో విభుఁని నన్ను నెదురుకట్లఁజూపి
మదము వెంచకురె మగువలాల
పదరి పండిదేరెనుఁ బంటిలోని రసములు
అదనెరఁగక మీరు అలసేరుగాని

చ. 3:

గక్కన శ్రీవెంకటేశ కాఁగిటిలో నన్నుఁగూర్చి
పక్కన నవ్వకురె పడఁతులాల
చిక్కెను నాకుఁ దొల్లె చెరకుపండినపండు
పెక్కుమారులు మీరు పెనఁగేరుగాని