పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0245-6 దేసాళం సంపుటం: 08-270

పల్లవి:

బుద్ధిమంతుఁడ వౌదువు పూఁచి బతుకఁ గలవు
వొద్దికతో నాకిపు డొక్క మనసాయను

చ. 1:

యేతులు నెరపవచ్చు నెమ్మెలాడుకొనవచ్చు
నాతోడి నవ్వులె నయమా నీకు
ఆతలివారైతె నిన్ను నన్నిటాఁ గాకు సేతురు
చేతికి లోనయినవారిఁ జెనకితే మేలుగా

చ. 2:

బాలు సేయంగవచ్చు పలుమారు బొంకవచ్చు
ఆసలు మాతోడిపొందు అనువా నీకు
పోసవోని వారయితె ముయికి మయి సేతురు
వాసి మానాపతులనె వంచుకొంటేఁ జెల్లునా

చ. 3:

గుట్టుసేసుకొనవచ్చు కూరిమి గొరవచ్చు
యిట్టి మాకూటములె యితవా నీకు
ఱట్టుసేతు రిందరు నాఱడి శ్రీవెంకటేశ
మట్టుతోడి వారినె మన్నించితేఁ దగుఁగా