పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0244-1 దేశా(సా)క్షి సంపుటం: 08-259

పల్లవి:

ఇద్దరికిఁ దగు తగు నిఁక నెన్నఁడూ
కొద్దిలేని పొంతనాలు గూడె మీకు నిపుడు

చ. 1:

పచ్చని మోవిచిగురు పందిలివెట్టె మాటల
దిచ్చరి సిగ్గుల నింతి తెరగట్టెను
పెచ్చువలపులఁ దానె పెండ్లికూతురై వున్నది
రచ్చసేసే వెందాఁకా రావయ్య లోనికి

చ. 2:

పెలుచుఁ దమకమున పెండ్లిపీఁట వెట్టుకొని
సెలవి నవ్వుల నించె సేసపాలు
కలికి కన్నుల నెగడె కుడు (కాటు?) కవెట్టెను
చలువగా నీకరుణ చల్లవయ్య సతికి

చ. 3:

పానుపు మీఁదికిఁ దీసె పాణిగ్రహణమున
నానారతులఁ జేసె నాగవెల్లి
మోనాన శ్రీవెంకటేశ మోవిబువ్వాలు దొడికె
ఆనిన వేడుకలనె అందవయ్య వియ్యము