పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0244-2 సాళంగనాట సంపుటం: 08-260

పల్లవి:

పొద్దువోని వానికిట్టె బుద్ది చెప్పవే
వుద్దండాలు చూప మోవి వూరడించేనే

చ. 1:

చదురులాడి యాతఁడు సారెకు నేరుతునంటా
వదరుఁదనములనె వాదించెనే
పరది యందుకు నేను పైకొని కొంగుపట్టితే
సదరము సేసుకొని సాదించెనే

చ. 2:

చలివాపి యింతలోనె సంగడి నిలువఁబెట్టి
పొలతులఁ దెచ్చి నాతోఁ బోలించీనే
తెలిసి అప్పటి నేను దీకొని నిలిచితేను
సొలపుల సొక్కించి సోలించీనే

చ. 3:

ఆరయ శ్రీ వెంకటేశుఁ డాయములంటి నన్ను
కోరి తన కాఁగిటిలోఁ గూడించీనే
తేరిచూచి యీవేళ తేనెమోవి యానితేను
ఆరితేరి మారుమాట లాడించీనే