పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0243-1 శ్రీరాగం సంపుటం: 08-253

పల్లవి:

తొల్లిటి సుద్దులకుఁగా దూర నేఁటికి
పల్లదా లన్నియునాడి పంతమిచ్చెఁ జాలును

చ. 1:

చెక్కునబెట్టిన చేయి సేపట్టినట్టి చేయి
వొక్క టెకాదా మన సొండు రేండాయ
నిక్కి తానేమి సేసునె నేఁడు నాభాగ్యముగాక
మొక్కితి ననవె తానె మొకమోడె నాకును

చ. 2:

అప్పుడు నవ్విన మోము అలిగిన మారుమోము
యెప్పటిదెకాదా యించుముంచాయ
తప్పులు తనందునేవె దైవము చేఁతలుగాక
కప్పురము గానుకీవె కరుణించె నన్నును

చ. 3:

కొంచి పెనఁగిన మేను గొబ్బనఁ గూడిన మేను
యెంచఁగ నిదియెకాదా యీడుజోడాయ
వంచనేలె శ్రీవెంకటేశ్వరుఁడు తా ననుఁ గూడె
మంచివె పనులనవె మన్నించె నన్నును