పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0241-6 సాళంగం సంపుటం: 08-246

పల్లవి:

మేమొక జాడవారము మీరలేము మీమాటలు
ఆమాటలు నెరపితే నందరికి సమ్మతా

చ. 1:

పోఁడిమి నాశాంతాలు పొగడేవు సారె సారె
నాఁడె నీవిచ్చిన బుద్ధి నాకుఁ గద్దుగా
కోఁడి నన్ను లోనుసేసుకొని నీయిచ్చఁ దిరిగి
ఆఁడుజాతి కిదేచాలు అంటె వారోరుతురా

చ. 2:

పిలిచి నన్నిందరిలో పెద్దరికము సేసేవు
తొలుతె చేపట్టితిగా తూరి రక్షించ
యిల నన్నొడఁ బరచి యిందరినిఁ బెండ్లాడి
పొలమెల్లా నిట్టె చుట్టుకొంటె వారోరుతురా

చ. 3:

కూడి నన్ను నారతులె గురుతులు సేసాడేవు
జోడు గద్దుగా నిన్నుఁ జూపి చెప్పను
యీడనె శ్రీవెంకటేశ యేలితివి నన్ని (న్ను?) సూటి
వాడకెల్లా నేర్పెనంటె వారిందు కోరుతురా